జాతకం అంటే ఏమిటి? చెప్పించుకుంటే కలిసి వచ్చేదేంటి

పిల్లాడు పుట్టాడంటే..వాడి జాతకం చూపించండి..పెద్దయ్యాక ఏమౌతాడో అంటారు.. చదువు అబ్బటం లేదంటే..అసలు వాడి జాతంలో ఏం రాసుందో చూపించండి అంటారు..ఇక పెళ్లి కుదరాలంటే జాతకాలు చూపించుకోవాలంటారు..ఉద్యోగం రావటం లేదంటే జాతకం చూపించుకోమంటారు..వ్యాపారం కలిసి రావటం లేదంటే ఓ సారి జాతకం చూపించుకోమంటారు…ఇలా  జీవితంలో ప్రతీ దశలోనూ జాతకం చూపించుకోవాలనే ఆలోచన మనకైనా వస్తుంది లేదా ఎవరైనా చెప్తారు.  దాంతో  అసలు జాతకం అంటే ఏమిటి..జాతకం చెప్పించుకుంటే ఏమన్నా కలసి వస్తుందా అనే సందేహం మనకు రావటం ఖాయం. 
అసలు జాతకం అంటే ఏమిటి? జాత అంటే పుట్టుక ….పుట్టుకతో వచ్చినది కావున జాతకం అంటారు. ఏ మనిషికైనా భవిష్యత్తు గురించి కొద్దో గొప్పో ఆలోచన  ఉండే ఉంటుంది. తెల్లారగానే  తనకు జరగబోయే శుభాశుభాలను గురించి తెలుసుకోవటం, ఏవైనా బాధలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవాలనుకోవటం, ప్రతిక్షణం సుఖసంతోషాలతో జీవించాలనుకోవటం మనిషి నైజం.  భవిష్యత్తును తెలుసుకోవాలన్నా, దానిని సుఖవంతముగా మార్చుకోవాలన్నా అది ఒకే ఒక శాస్త్రంతోనే సాధ్యమవుతుందని నమ్మిన వారు జ్యోతిషాన్ని ఆశ్రయిస్తారు.  
అలాంటప్పుడు జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనము జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహస్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు.  దీనినే జాతకచక్రము, జన్మకుండలి, హోరోస్కోప్‌ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాలవారు సంబోధిస్తూండటం కూడా గమనించవచ్చు. ఒక వ్యక్తి జన్మించిన సమయము, ప్రదేశము ఆధారముగా జాతకచక్రము గణిస్తూంటారు. 
జాతం చెప్పించుకోవటం వల్ల ప్రయోజనం
చీకటిలోని వస్తువులను దీపం సహాయంతో చూసినట్లుగా జ్యోతిష శాస్త్ర సహాయంతో జీవితంలో జరుగబోయే శుభాశుభ సంఘటనలను ముందుగా గుర్తించి.. దాంతో మంత్ర, ఔషధ, జప, దాన, హోమ, రత్న ధారణాది శాంతి ప్రక్రియల ద్వారా వ్యతిరేక ఫలితాలను నివారించుకోవచ్చని వరాహమిహిరుల వారి సందేశం మనకు లఘు జాతకం అనే గ్రంథంలో కనిపిస్తోంది.మన గ్రహ స్థితిని అనుసరించి మనం తగు జాగ్రత్తలు పాటిస్తే పెను ప్రమాదం నుండి కాపాడబడి ఉపశమనం పొందగలము.